Sunday, 12 December 2010

వర్షంలో స్నానం చేసిన చెట్లు


చిన్నప్పటి నుంచి క్లాసు లో ఫస్ట్ / సెకండ్ ర్యాంక్ ల లో ఉండే వాణ్ణి. మాస్టారు చెప్తున్న పాఠాల్ని చాలా శ్రద్దగా వినే వాణ్ణి. గురువు గారు ఏమి చెప్పినా, దాన్ని కళ్ళకు కట్టినట్టు ఉహించుకోవడం నా ప్రత్యేకత. కొన్ని కొన్ని పాఠాలు అలా ఉహించుకున్నప్పుడు నమ్మ శక్యం గా ఉండేవి కావు. ఆ కోవ కు  చెందిన ఒక పాఠం గురించి రాస్తున్నాను.
ఏ క్లాసు లోనో గుర్తు లేదుగానీ, ఇంగ్లీష్ POETRY (మీరేవరయిన ఈ పాఠం చదివినట్టు గుర్తుంటే, వివరాలు నాకు గుర్తు చేయ ప్రార్థన)

పాఠం ఇలా సాగుతుంది..
కవి వర్షం వెలసిన తర్వాతి ప్రకృతి అందాలను వర్ణిస్తూ పొగుడుతున్నాడు
ఆకాశం అలా ఉంది
మబ్బులు ఇలా ఉన్నాయి
పక్షుల కిల కిల రావాలు
ఇంక ఏదో చాలా చెప్తున్నాడు
అదే క్రమంలో చెట్ల గురించి వర్ణిస్తూ
చెట్లు ఈ వర్షంలో తడిచి అప్పుడే స్నానం చేసినట్లున్నాయి
పచ్చగా ఉన్నాయి, గడ్డి అలా ఉంది ఇలా ఉంది అని సాగుతుంది...

ఆ పాఠం చదివినప్పుడల్లా అంతా బాగానే ఉంది గానీ, ఈ కవి ఏంటి, వర్షంలో చెట్లు స్నానం చేసి పచ్చగా మెరిసిపోతున్నాయి  అంటాడు. మన చెట్లు మాత్రం ఎంత వర్షం పడ్డ అంత పచ్చగా ఉండవే?  మాది నేషనల్ హైవే మీద ఉన్న చిన్న పల్లెటూరు లెండి. కాలుష్యం వల్లనేమో చెట్లన్నీ ఎప్పుడూ మసి బూసినట్టే ఉండేవి. వర్షం పడ్డా, తేడా ఏమీ ఉండేది కాదు. అదీ కాక వర్షం అంటే నాకు, చెడ్డ చిరాకు. కేవలం నాలుగు తరగతి గదులు ఉన్న స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వాళ్ళు కూర్చోవాలి. కొన్ని  క్లాసులు వరండాలో కొన్ని  క్లాసులు చెట్ల కింద కూర్చొని క్లాసులు వినే వాళ్ళం. వర్షం వస్తే ఒక్కో గదిలో రెండేసి, మూడేసి క్లాసులను తోసేసే వాళ్ళు. కోళ్ళ ఫారం లో కోడి పిల్లల్లాగా కీసర బేసర గా ఉండేవి క్లాసులన్నీను. వర్షం వస్తే బురద, రొచ్చు. ఉళ్ళో మురుగంతా మా స్కూల్ ముందే ఉండేది.

నేను కన్విన్సు కానీ పాఠాల్లో ఇది చాలా ముఖ్యంగా మిగిలిపోయింది. చిన్న పిల్లాన్ని కదా! అప్పట్లో మా ఊరు లాగానే ప్రపంచం అంతా ఉంటుంది అనే అమాయకత్వం, తెలియని తనం...



ఆస్ట్రేలియా లో విశాలమయిన పార్కులు, పెద్ద పెద్ద చెట్లు... చాలా సార్లు వర్షం తర్వాత నేను ఆ ప్రకృతి అందాలను ఎంత బావున్నాయో అంటూ చూస్తుండి పోయాను. ఇలా కొన్ని సార్లు వర్షం తర్వాత అందాలను తన్మయత్వంతో చూసిన నాకు-  "ఆ కవి విదేశీయుడు కావడం వల్ల, ఆయన సహజంగానే వాళ్ళ దేశం లో ప్రకృతి ని వర్ణిస్తూ రాసి ఉంటాడు. దాన్ని మన ఊరితో పోల్చుకోవడం వల్ల నేను కన్విన్సు కాలేదు" అనిపించింది. కవి, పైన ఉన్న ఫోటో లో లాంటి అందమయిన ప్రదేశాలను చూసి ఆ కవిత రాసి ఉండొచ్చు.

ఏది ఏమయినా, మా ఉళ్ళో చెట్లు, గట్రా అంత బాగోక పోయినా, (ఈ మధ్య రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉన్న చెట్లన్నింటిని తీసివేశారు లెండి.) చిన్న తనంలో మా ఊరిని నేను ఎంత తిట్టుకున్నా, ఇప్పుడు మాత్రం, మా ఊరు చాలా గొప్ప ఊరు, చాలా అందమయిన ఊరు అంటాను. కాకి పిల్ల కాకి కి ముద్దు అంటారా? మీరేమయిన అనండి, మా ఊరంటే, నాకు చాలా ఇష్టం

ఆస్ట్రేలియా లో మా ఇక్కట్లు 2 వ బాగం

మొదటి బాగం లో రాసినట్లు అలా మొదటి మూడు రోజులు సాగాయి.
ఎట్టకేలకు మా అపార్ట్మెంట్ లో కి వచ్చి, భోజనం చేసాం కదా...

మేము మంచి చలి కాలంలో వచ్చాం, హీటర్ ఆన్ చేస్తే పని చేయడం లేదు. అడ్మిన్ స్టాఫ్ వీకెండ్ లో పని చేయరు కాబట్టి, సోమవారం వరకు మా మొర వినే నాధుడే లేడు. ఒకేసారి 35 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత కి వచ్చేసరికి మా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. .మేము ఇండియా నుంచి ఒక పెద్ద రగ్గు తెచుకున్నాం. బెంగళూరు వాతావరణంలో మంచి ప్రశంసలు పొందిన ఈ రగ్గు, మెల్బోర్న్ వాతావరణానికి నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. స్వెట్టర్, సాక్స్ వేసుకున్న ఉపయోగం లేదు. ఆ రాత్రి జాగారం.  

ఉదయాన్నే షాప్ కి వెళ్లి ఒక మంచి క్విల్ట్ (తెలుగులో బొంత అంటారేమో కదా!) తీసుకున్నాం. క్విల్ట్ వల్ల కొంత పరిస్థితి మెరుగు ఐనప్పటికీ మాకు కష్టం గానే ఉంది.  రాత్రి అవుతుంది అంటే నరకం. సరే ఇంకెంత, రేప్పొద్దున్నే, మన ఆస్థాన సిబ్బంది విచ్చేస్తారు కదా అని కోటి ఆశలతో ఎదురు చుస్తూ ఆదివారం రాత్రి కూడా జాగారం చేశాము. 
సోమవారం పొద్దున్నే, సిబ్బందిని కలిసి, ఒప్పందపు పత్రం తాలూకు ఫార్మాలిటీస్ పూర్తి చేసి, హీటర్ సమస్యని వివరించాను. వాళ్ళు తాపీగా ఇదిగో, ఈ బుక్ లో మీ సమస్య వివరాలు  రాయండి మీ వంతు వచినప్పుడు టేక్నిషియన్ వచ్చి బాగుచేస్తాడు. వంతు ఏమిటి స్వామి అంటే, మాకు కొన్ని ప్రాదాన్యతలుంటాయి. టేక్నిషియన్ కూడా బిజీ గా ఉంటాడు. వాళ్ల స్లాట్స్ కూడా చూస్కొని చేపిస్తాం. 2 -3 రోజులు పట్టవచ్చు. ప్లీజ్ బేర్ విత్ అజ్ అన్నాడు.
ఈ తంతు పూర్తి చేస్కొని సోమవారం ఆఫీసు కి వెళ్ళాను. సరయిన నిద్ర లేకపోవడం వల్ల, సీట్ లో కూర్చుంటే నిద్రోచేస్తుంది. అసలే కొత్త వర్క్ ప్లేస్. మన పోస్ట్ ఏమో బోడి కన్సల్టెంట్. మా వాడికి బిల్లింగ్ ముఖ్యం. మా క్లైంట్ కి నా పని ముఖ్యం. నేను అసలే చాలా సిన్సియర్. నన్ను నేను ఇలా నిద్ర మొహం తో చూస్కో  లేక, మా కంపెనీ వాడికి ఫోన్ చేసి నా పరిస్థితిని వివరించి, నేను ఇక్కడ ఉండలేను, వేరే ఇల్లు చూడు. లేకపోతే ఇండియా వచ్చేస్తాను అని చెప్పాను.  వాడు మాత్రం 'మేము ఈ అపార్ట్మెంట్ కి మూడు నెలలు ఒప్పందం రాశాం, ఇప్పుడు ఏమి చేయలేము'  అని కరుడు గట్టిన తీవ్రవాది మాదిరిగా చెప్పాడు. నా ఈగో ని తృప్తి పరుచుకోవడానికి 'ప్రతి కుక్క కి ఒక రోజు వస్తుంది' అని చెప్పుకొని, ఆ తీవ్రవాదిని క్షమించి, కిం కర్తవ్యం అని, పరిస్థితులకు అలవాటు పడటానికి ట్రై చేస్తూ, దేవుడా.. ఏవిటయ్యా  ఈ పరీక్షలు. ఇండియా లో పెడితే పర్లేదు. పరాయి దేశంలో మాకు ఈ టెస్ట్ లు వద్దు స్వామి అనుకుంటూ పునరావాసం కోసం చూస్తున్న, వరద బాదితుల లాగా హీటర్ కోసం ఎదురు చేస్తున్నాం. ఎట్టకేలకు శుక్రవారం నాటికి ఈ హీటర్ సమస్య పరిష్కారం అయింది. 

హీటర్ సంతోషం ఆట్టే నిలవలేదు. 4 -5 డేస్ లో మరొక సమస్య. 

 నా కన్ను ఎర్రగా అయ్యి కంటి నుండి నీరు కారటం... కలకలు అంటాం కదా... అటువంటిదే. పొద్దున్న లేస్తే పడుకునే దాక కూర్చునేది కంప్యూటర్ ముందే. సెలవు కుదరదు. చలి గాలికి ఈ కంటి బాధ వర్ణనాతీతం . మన దేశం లో మందుల షాపులు  ఎలాగో ఇక్కడ ఫార్మసీలు ఉంటాయి. అక్కడికెళ్ళి మన బాధ చెప్తే మందు ఇస్తారు అని వెళ్ళాను. జస్ట్ అబౌట్ టు క్లోజ్. అమ్మా తల్లి అని, నా బాధ అని చెప్పబోతుంటే, సారీ, వుయ్ ఆర్ క్లోజేడ్  అంది. సూపర్ మార్కెట్ కి వెళ్లి గూగుల్ అమ్మ సాయంతో మరియు నాకున్న మిడి మిడి జ్ఞానం తో అక్కడ ఒక ఐ డ్రాప్స్ తీస్కోని వాడాను. వేస్కున్న వెంటనే చాలా రిలీఫ్ గా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత మళ్ళీ మాములే. తగ్గుతుంది అనే ఆశతో  2 డేస్ చూశాను.ఫలితం లేదు. ఫార్మసిస్ట్ దగ్గరకి వెళ్లి, నా బాధ చెప్పుకుంటే, ఆవిడ ఒక మందు ఇచ్చి  3 డేస్ లో తగ్గాలి, తేకపోతే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి అంది. సరే అని 3 డేస్ చూశాను. అదేంటో, నా కన్ను అంతగా నచ్చిందేమో, నేను పోను అని మొండికేసి కూర్చుంది. మన దేశం లో అయితే ఒక వేప కాయ ట్యూబ్ వేస్తే, 2 డేస్ లో టాటా చెప్పాల్సిందే.

డాక్టర్ దేవుడు ఎక్కడున్నాడు అని గూగుల్ అమ్మని అడిగి, కోటి ఆశలతో అక్కడికి వెళ్తే, వాళ్ళు అప్పాయింట్మెంట్ ఇచ్చారు, మరుసటి రోజు ౩ గంటలకు రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చారు. అదేంటో, డాక్టర్స్ కూడా 9 -5  పని చేస్తారు. కన్ను పోయేలా ఉంది అంటే, మరుసటి రోజు రమ్మంటారు :( 

వాళ్ళు చెప్పిన టైం కి వెళ్లి, చాలా ఆత్రుత తో చూస్తున్నాను. ఇక్కడ మన దేశం లో లాగా ఒక డాక్టర్ కి ఇద్దరు ముగ్గురు నర్సులు లేరు. ఆయనే బయటకి వచ్చి నన్ను లోపలి తీస్కెళ్ళాడు. ఆయనకి నా బాధను చాలా వివరంగా చెప్పి, వల వల ఏడ్చినంత పని చేశాను. ఆయన అన్ని కోణాల్లో, కేసు ని దర్యాప్తు చేసి, నాకేమన్న చూపు మందగించినదా అని కూడా వెరిఫై చేస్కొని  డ్రాప్స్ ఇచ్చి  5 డేస్ వాడు, తగ్గకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెల్దువు అన్నాడు. డ్రాప్స్ వైపు, తన వైపు నేను చూసిన చూపు ని డాక్టర్ బాగా క్యాచ్ చేసాడు. అయ్యా, anti-biotic  tablets  ఇవ్వండి. కాస్త 1 -2 రోజుల్లో తగ్గే మార్గం ఎమన్నా చూపండి. నేను ఆల్రెడీ ఈ కలకలతో వారోత్సవాలు జరిపేసాను. మాసోత్సవాలను జరుపుకొనే ఓపిక లేదు.  దీన్ని ఇంకో 2 -3 వారాలు  సాగ పీక కుండా, 1 -2  రోజుల్లో తగ్గే మార్గం సెలవివ్వండి స్వామి అంటే... ఆయనొక నవ్వు నవ్వి anti-biotic  వల్ల నష్టాల మీద నాకు క్లాసు తెస్కొని పంపించేసాడు. నాలుగు రోజుల్లో  తగ్గడంతో హమ్మయ్య అని ఉపిరి పీల్చుకున్నాను.

మనమేమో ఇండియా లో పిల్లోడికి జలుబు చేసినా, anti-biotic ని విరివిగా వాడేసి రెండు రోజుల్లో తగ్గించేసి, వాడి బాడీ మీద మామూలు మందులు పనిచేయకుండా చేసేస్తాం. ఆ ప్రభావంతో వీళ్ళు ఇచ్చిన మందులు మన మీద అంతా తేలిగ్గా పని చేయలేదు అనిపించింది నాకు. లేకపోతే కళ్ళ కలకకు పది రోజుల పైన అవస్థ పడటం ఏంటి, ఇలా బ్లాగ్ లో బాధలు రాయడం ఏంటి..

మొత్తం మీద మొదటి మూడు వారాలూ, అష్ట కష్టాలు పడినా, తర్వాత  అంతా సవ్యం గానే ఉంది. సమ్మర్ కూడా వచ్చేయడంతో ఒకే రోజు ఎండాకాలం వానాకాలం చలికాలాలను చూస్తున్నాం.  మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కొని  ఇంకో నాలుగు రోజుల్లో మన దేశానికి  వచ్చేస్తున్నాం. 

Thursday, 9 December 2010

ఫైర్ అలారం గోల

ఆస్ట్రేలియా లో మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో నిన్న ఒక సంఘటన జరిగింది. నిన్న పొద్దున్నే మా ఆయనని ఆఫీసు కి సాగనంపి , నా పనులు చక్కపెట్టుకొని ,స్నానం చేసి పూజ చేయటం మొదలుపెట్టాను.ఇంతలో హటాత్తుగా ఫైర్ అలారం మోగటం మొదలు అయింది .నాకు ఒక్క నిమిషం అర్ధం కాలేదు .ఏమి అవుతుంది, నేను స్టవ్ మీద ఏమైనా పెట్టి మాడ్చేసానా అని అనుమానం వచ్చి చూశాను, ఏమి లేదు. వెంటనే తలుపు తీసాను అందరూ హడావిడి గా పరుగులు తీస్తున్నారు .ఒక చైనా ఆవిడని 'ఏమి అయింది అని' అడిగాను.  ఆవిడ ఏదో చెప్పింది, నాకు ఏమి అర్ధం కాలేదు. సర్లే ఈవిడ తో పెట్టుకుంటే కష్టం అని  మా అయన కి ఫోన్ చేశా. ఏమి బయపడకు పాస్ పోర్ట్ లు, తాళం తీసుకొని లిఫ్ట్ లో కాకుండా మెట్లు దిగి కిందకు వెళ్ళు అన్నారు.ఆ టెన్షన్ లో నాకు మెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా అర్ధం కాలేదు. రోజు లిఫ్ట్ ఉండేసరికి మెట్ల తో పని లేక అవి ఎక్కడ ఉన్నాయో చూస్కోలేదు.మేము ఉండేది 20 వ ఫ్లోర్ లో. అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి నా పని అయిపోయింది.

మన దేశం లో ఐతే ఫోన్ చేసిన గంటకి కానీ ఫైర్ వాళ్ళు రారు. ఇక్కడ మాత్రం రెండు మూడు నిమిషాలలో ఒక పది మంది టీం వచ్చారు ..కొంత మంది కింద ఏదో చేస్తున్నారు కొంత మంది పైకి వెళ్లారు .నాకు మాత్రం ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.

ఒక వేళ ఇప్పుడు ఏదైనా  జరిగితే  మా సామాను అంతా ఎలా, అసలే మా అయన ఈ మద్యనే laptop కొనిపెట్టారు. నా ధ్యాస అంతా వీటి మీదే ఉంది. సర్లే ఇప్పుడు నేను చేయగలిగింది ఏమి లేదు అని చూస్తున్నాను. నేను ఇక్కడ ఏమి జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటే మా అయన నిమిషానికి ఒక సారి ఫోన్ చేసి అక్కడ తాజా పరిణామాలు ఏంటి అని అడుగుతున్నారు...ఇలా  40 నిముషాల టెన్షన్  తర్వత వాళ్ళు తేల్చింది ఏంటి అయ్యా అంటే...  6 వ అంతస్తులో ఒక మహానుబావుడు ఎవడో ఫైర్ అలారం కింద నుంచొని సిగరెట్ కాల్చుకున్నాడు అట...నాకు ఆ నిమిషం లో అతను ఎవరో చూపిస్తే... కత్తిపీట పెట్టి పీక కోయాలి అనిపించింది.ఇంక అందరూ నెమ్మది గా పైకి  వెళ్ళటం మొదలుపెట్టారు.మనకి అసలే ప్రాణం మీద తీపి ఎక్కువ ,రిస్క్ తీసుకోవటం ఎందుకు అని అందరూ వెళ్ళిన తర్వాత చిన్నగా వెళ్ళాను.

ఇలాంటిదే అంతకు ముందు కూడా ఒక సారి జరిగింది. ఒక రోజు అర్ధరాత్రి మంచి నిద్ర లో ఉన్నాం .ఒక్క సారిగా అలారం మోగింది .మేము తేరుకొని కిందకు వద్దాం అని రెడీ అయ్యేసరికి ఇది ఫాల్స్ అలారం అని ప్రకటించారు..తెల్లారి  మా ఆయన రిసెప్షన్లో  కనుక్కుంటే తెల్సింది ఏంటి అంటే ఎవడో ... పీకల దాక తాగి అర్ధరాత్రి వంట చేయటం మొదలు పెట్టాడట. ఆ మత్తులో ఆ కూర కాస్త మాడి అలారం మోగింది అట. నైట్ రెండు గంటలకు వంటేమిటి వాడి బొంద.

అయినా వీళ్ళిద్దరి తిక్క బాగా కుదిరిందిలే. అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి చెరొక 2000 $ జరిమానా విదించారుగా !!!

ఈ మధ్య మా అయన బ్లాగ్ లు రాయటం మొదలు పెట్టారు.
సరే నేను కూడా ఒక రాయి వేద్దాం అని  రాస్తున్నాను.

శ్రీమతి కృష్ణ

Wednesday, 8 December 2010

ఆస్ట్రేలియా లో మా ఇక్కట్లు


ఆస్ట్రేలియా ఒక అందమైన దేశం. మా కంపెనీ వాడి పుణ్యమా అని, నా శ్రీమతికి  బ్రిస్బేన్ మరియు మెల్బర్న్ చూపించ గలిగాను. బ్రిస్బేన్  లో మూడు నెలలు ఉన్నాం . ఇండియా వెళ్లి "ఇంటి దగ్గర నుంచి  పని" దయ వల్ల రెండు నెలలు ఇంట్లో పేరెంట్స్ తో ఉంటూ పనిచేస్కోని, మళ్ళీ మెల్బర్న్ కి  వచ్చాం . ఇటీవల కాలంలో భారతీయుల మీద దాడుల దృష్ట్యా  మొదటి నుంచి  ఆస్ట్రేలియా అంటే  వెళ్లొద్దు అని  ఇంట్లో గొడవ.ఏదో వాళ్ళకి నచ్చచెప్పి బ్రిస్బేన్ వెళ్ళాం. అక్కడ అంత సాఫీ గా సాగిపాయింది.ఈ సారి మెల్బర్న్ అంటే అస్సలు ఒప్పుకోలేదు. మా అత్తా మామలు కూడా  చాలా భయడ్డారు.

చాలా కష్టపడి అందర్నీ ఒప్పించి  మెల్బోర్న్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి మా కష్టాల పర్వం మొదలు అయింది. మేము ఉండటానికి అన్ని ఏర్పాట్లు మా కంపెనీ వాళ్ళే చేసారు. 

మనం వచ్చి  పాస్ పోర్ట్ చూపించి, ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే మనకు రూం ఇస్తారట.మాకు కేటాయించిన అపార్ట్ మెంట్ నిర్వహణ సిబ్బంది కూడా మన లాగానే శని అది వారాల్లో ఎంచక్కా సెలవు తీసుకోవడం తో బాటు కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే పని చేస్తారట. మా కంపెనీ వాళ్ళు మాకు ఇంత వివరంగా చెప్పి ఉంటే, బహుశా ఈ బ్లాగ్ రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని ఉండేది కాదు.

మీరు వెళ్ళగానే ఉండటానికి వేరే హోటల్ రెండు రోజులకు బుక్ చేసాము, దానిలో చెక్-ఇన్ చేస్కొని విశ్రాంతి తీస్కోని మరునాడు చక్కగా ఆఫీసు కి వెళ్లి, మీకు వీలయినప్పుడు అపార్ట్మెంట్ కి వెళ్ళండి. మీకు టెన్షన్ ఉండకూడదు అని రెండు రోజులకు హోటల్ బుక్ చేసాం, పండగ చేస్కొండి అన్న రేంజ్ లో చెప్పాడు మావాడు.  ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్  క్రోకోడయల్ ఫెస్టివల్... అని మాకు తెలియదు కదా.

మేము గురువారం  మెల్బర్న్ లో దిగాం కదా...  అక్కడ నుంచి నేరుగా హోటల్ కి వెళ్ళాం. వెదవది హోటల్లో కనీసం కాఫీ పెట్టుకునే సౌకర్యం కూడా లేదు. ఆ రాత్రికి  KFC మీద ఆధారపడ్డం .శుక్రవారం ఉదయం అల్పాహారంగా ఏదో బిస్కెట్స్,ఆపిల్ తిన్నాం . శ్రీమతికి  లంచ్ టైములో తినటానికి ఏదో ఇచ్చి నేను ఆఫీసు బయల్దేరాను. మొదటి రోజు కదా... ఉల్లాసంగా ఉత్సాహంగా, ఆస్ట్రేలియా దేశంలో... మెల్బర్న్ నగరంలో... అని ప్యారడీ పాటలు పాడుకుంటూ.... ఆఫీసు కి వెళ్ళాను.

KFC  , మెక్ డోనల్డ్స్ తో మొహం మొత్తిన మేము,   శుక్రవారం రాత్రి  ఆహా, రేపు పొద్దున్నే ఎంచక్కా అపార్ట్మెంట్ కి వెళ్ళొచ్చు, సుష్టు  గా వండుకొని తినొచ్చు, అనుకుంటూ గుడ్ నైట్ చెప్పుకున్నాం. శనివారం ప్రొద్దున్నేకాలింగ్ బెల్ మోగుతుంటే, ఎవడబ్బా అనుకుంటూ లేచి చూశాను, ఎదురుగా హోటల్ బాయ్ క్లోజ్ అప్ నవ్వుతో , మీరు  పన్నెండు గంటలకు ఖాళీ చేయాలి అని చెప్పాడు. టైం చుస్తే, అప్పటికే, పదకొండున్నర అయింది, జెట్లాగ్ ప్రభావం తో మేము  కుంభ కర్ణ ద్వయం లాగా నిద్రపోయాం అని అర్ధం అయింది.

హడావిడిగా బయల్దేరి హోటల్ రూం ఖాళీ చేసి,  అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్ళాం. అక్కడ, మమ్మల్ని పలకరించే నాధుడే లేడు. చేసేది  లేక మా కంపెనీ వాడికి ఫోన్ చేసి విషయం వివరించాము. వాడు తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి, ఈ రోజు శనివారం కదా,  రిసెప్షన్ లో ఎవ్వరూ  ఉండరు, మీరు వెళ్ళటానికి కుదరదు అని మాకు చావు కబురు చల్లగా చెప్పాడు. ఏమి చేయాలో పాలు  పోలేదు. నేను డిటెక్టివ్ నారద లాగా కష్టపడి, మొత్తం మీద అత్యవసర సిబ్బంది నెంబర్ సంపాదించాను. 10 సార్లు ట్రై చేస్తే, దేవుడి కరుణించి, వాడు ఫోన్ తీసి మా బాధ అర్ధం చేస్కొని అక్కడికి వచ్చి మమ్మల్ని లోపలి తీసుకువెళ్ళాడు. ఇతను మమ్మల్ని మా రూం లోకి తీసుకెళ్ల గలడు కానీ, తాళాలు ఇచ్చే అధికారం తనకు లేదు. అంటే, రూం లోపల ఎప్పుడూ ఒకళ్ళు ఉండి తలుపు లోపలినుంచి తియ్యాలి అన్నమాట. కొసమెరుపు ఏంటి అంటే, మా వాడు ఏమి చెప్పాడో, వీడు ఏమి విన్నాడో గానీ, సింగిల్ కాట్ ఉన్న రూం  ఇచ్చాడు. 

ఏదో ఒకటిలే  ముందు ఉండటానికి ఉంది కదా, ఈ రోజు ఒక్క రోజు సర్దుకుపోదాంలే  అనుకున్నాం .చాలా చిన్న రూం, పేరుకు స్టూడియో అపార్ట్మెంట్ కానీ కిచెన్ లో కనీసం చెంచా కూడా లేదు. బాచిలర్ రోజుల్లో కొత్తగా రూం తెస్కొని , కిరోసిన్ స్టవ్, గిన్నెలన్నీ కొనుకున్నట్టు, నేను ఒక్కన్నే వుల్ వర్త్ సూపర్ మార్కెట్ కి వెళ్లి, చెంచా, కత్తి, ప్లేట్, కూర గిన్నెలు... ఇలా కావాల్సిన వన్నీ కొనుక్కొని ఇంటికొచ్చే సరికి టైం సాయంత్రం నాలుగున్నర. అసలే మా పరిస్థితి పులిహోర మీద విరక్తి చెందిన వరద బాదితుల్లాగా ఉంది. దానికి తోడూ ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు.
అంతా నీరసంలో కూడా, పాపం చాలా ఓపిక చేస్కొని, పొయ్యి వెలిగించి, వంట చేసింది మా ఇంటావిడ. తృప్తిగా తిని  మూడు రోజులు అయినదేమో, టమాట కూర, గ్రీక్ స్టైల్ పెరుగుతో  చాలా చాలా సంతోషంగా తిన్నాం. ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా 'దేవుడు ఆడవారికి ఓపిక, సహనం ఇచ్చి ఉండకపోతే ఈ భూమి మీద చాలా పనులు ఆగిపోతాయేమో కదా'  అనిపిస్తుంది.

ఇవి కేవలం మొదటి మూడు రోజుల కష్టాలే.ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ రియల్ క్రోకో డయల్ ఫెస్టివల్... మిగతా కష్టాలను వచ్చే టపాలో వివరిస్తాను.
సెలవు...

Sunday, 5 December 2010

మా యాకోబు రాజకీయ కష్టాలు

రాజకీయాలు అంటే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడానికి మంచి మార్గం అని అందరం అనుకుంటాం.  రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పవర్ చేతిలో ఉంటుంది, బ్యాంకు రుణాలు సులభంగా తెచ్చుకోగలరు. సామాన్యుడు బర్త్/డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా నానా తంటాలు పడతాడు. కానీ నాయకులకు మాత్రం చాలా వీజీ గా ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా ఫోన్ మీదనే అంత రెడీ అవుతుంది. దాన్నే మనం అదికార దుర్వినియోగం అంటాం. దుర్వినియోగం కూడా ఒక మోతాదు వరకు అవసరమేమో అనిపిస్తుంది మా యాకోబు గుర్తుకొచ్చినప్పుడు...

మా గ్రామంలో యాకోబు అని  ఒక గొర్రెల కాపరి ఉండే వాడు. వేలిముద్ర బాపతు. తనలోకంలో తను గుట్టుగా బతుకుతున్నాడు. చిన్న తనంలో నేను మా పొలాల్లో తిరిగే రోజుల్లో గొర్రెలు కాస్తూ కనిపించేవాడు.

ఈ మధ్య నేను, మా అన్నపొలం నుంచి వస్తుంటే, ఒక మనిషి అన్నయ్యని  పలకరించాడు. వైట్ షర్టు వైట్ లుంగి, కాంగ్రెస్ టవల్. నేను గుర్తుపట్టలేదు. మా అన్న చెప్పాడు, యాకోబు రా అని. యాకోబు ఏంటి, ఈ గెటప్ ఏంటి, నాకు ఏమీ అర్ధం కాలేదు...  తర్వాత అన్న చెప్పింది ఏంటి అంటే- 2001 ఎన్నికల్లో, యాకోబు వద్దు మొర్రో అన్నా రిజర్వేషన్స్ పుణ్యమా అని MTPC మెంబర్ గా పోటీ చేయాల్సి రావడం, ఇంటర్మీడియట్ చదివిన ప్రత్యర్ధి మీద గెలవడం, ఎంత వేగంగా పదవి వచ్చిందో అంతే వేగంగా పదవీకాలం ముగియడం, తర్వాత MPTC మెంబర్ వేరే వర్గానికి రిజర్వు కావడం... పాపం ఇంతకు ముందు హ్యాపీ గా గొర్రెలు కాసుకు బతికేవాడు. ఈ రాజకీయం పుణ్యమా అని ఉన్న 50 గొర్రెలను అమ్ముకొని, ఖర్చుపెట్టాడు. పదవి ఉన్నంత కాలం ఏదో అలా నెట్టుకొచ్చాడు. పదవి పోయాక, పలకరించే దిక్కు లేక, తను గతం లో చేసిన పనులు చెయ్యలేక, ఇలా వైట్ అండ్ వైట్ రాజకీయ నాయకుడి గెటప్ లోనే కాలక్షేపం చేస్తున్నాడు అని చెప్పాడు. మరి కుటుంబం పరిస్థితి ఏంటి అంటే,యాకోబు మీద గౌరవంతో, పెళ్ళాం అర్ధం చేస్కొని 2 గేదెలను పెట్టుకొని కుటుంబ బారాన్ని మోస్తుందని చెప్పాడు.
అతడు సినిమాలో MS నారాయణ దోసె  జోక్ గుర్తుకొచ్చింది. నా మానాన నేను మాడి పోయిన మసాల దోస తింటుంటే...
యాకోబు తన నిజాయితి కి కట్టుబడి, ఎటువంటి ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా, ఆశించకుండా పని చేసి, ఇలా రాజకీయ కష్టాలు పడుతుంటే, చూసే వాళ్ళకు 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అని అనిపించడంలో ఆశ్చర్యం ఏమయినా ఉందా?

మన వ్యవస్థలో కూడా లోపం ఉంది. MPTC మెంబర్ పదవి అయిపోయాక గొర్రెలు కాయకూడదు అనే యాకోబు మైండ్ సెట్ కావొచ్చు.రాజకీయం అంటేనే అవినీతి, అక్రమార్జన, రాజకీయ నాయకులంటే మానవాతీతులు, వాళ్ళు మామూలు పనులు చేయకూడదు అనే సమాజం కావొచ్చు. రిజర్వేషన్ వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకునే  ప్రభుత్వ విధానాలు కావొచ్చు.

యాకోబు లాగా ఇబ్బందులు పడుతున్నచిన్ననాయకులకు ఏదో ప్రత్యేక అవకాశాలు కల్పించాలేమో? దాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి మన వాళ్ళు పోటీపడతారేమో?
ఏది ఏమయినా, అన్ని రంగాల్లో లాగానే రాజకీయాల్లో కూడా ఇలాంటి అవస్థలు పడుతున్న మా యాకోబు లాంటి వారు చాలా మందే ఉన్నారు.

Saturday, 4 December 2010

ఆంధ్రప్రదేశ్ రాజకీయ మహానుబావులు: నా మొదటి బ్లాగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పెద్ద టాపిక్...
రాజకీయాల పై నాకున్న సహజమైన ఆసక్తి రీత్యా నేను కాలేజీ రోజుల్లో రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండే వాణ్ణి. 
చిన్నతనం నుంచి ఈనాడు పేపర్ ని డైలీ ఫాలో అవ్వడం, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను (వారి గురించి తర్వాత ప్రత్యేకంగా చెప్తాను) చాలా దగ్గరనుంచి చూడటం, ఉమ్మడి కుటుంబ నేపద్యంలో పెదనాన్న, నాన్న, పెద్దమ్మ గ్రామ స్థాయి పదవులు చేయడం మొదలగు కారణాల వాళ్ళ, నాలో చిన్నతనం నుంచి రాజకీయాల మీద ఆసక్తి కలిగింది.
చదువులు పూర్తి చేస్కొని కాస్త లైఫ్ లో సెటిల్ అయ్యే క్రమంలో రాజకీయాల మీద శ్రద్ద కొంచెం తగ్గింది. వైయస్ మరణం తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ మద్య కాలంలో రాజకీయాల గురించి ఆలోచన పెరిగింది. నా ఆలోచనల తో ఒక బ్లాగ్ రాయాలి అని నిర్ణయించుకొని, ఎట్టకేలకు ఈరోజు ఈ టాపిక్ తో ప్రారంభిస్తున్నాను. 

మన రాష్ట్ర రాజకీయాల్లో ఎందరో మహానుబావులు... అందరికి వందనాలు!!!
చాలా మంది గొప్ప గొప్ప నాయకులు మన రాష్ట్రము నుంచి ఉన్నారు. 
PV నరసింహారావు గారు NTR గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైయస్ గారు.
PV నరసింహారావు గారు బహుబాషా కోవిదులు. CM గా మరియు PM గా చేసి మన తెలుగు వారి గొప్ప తనాన్ని చాటి చెప్పారు. 
NTR తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో, పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో అధికార పీఠాన్ని అలంకరించడం మహాద్బుతం.
చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్నిఅత్యదిక రోజులు పరి పాలించిన ఏకైక వ్యక్తి. IT లో రాష్ట్రాన్ని ఒక ప్రముఖ స్థానం లో నిలబెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో నాయుడు గారి పాత్ర చాలా ముఖ్యమయినది.
రాష్ట్రము లో కాంగ్రెస్ కి జెండా కట్టే నాధుడే కరువయ్యడా అనే పరిస్థితుల్లో, వైయస్ పాద యాత్ర చేపట్టడం, అద్బుతమయిన మెజారిటీ తో అధికారం లో రావడం, రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక మలుపు. పచ్చిగా చెప్పాలి, అంటే ప్రతి పక్షం లో ఉండి, విసిగి వేసారి, TDP లోకి పోలేక, కాంగ్రెస్ లో ఉండలేక, కాంగ్రెస్ అధికారం లోకి రావడం కేవలం కల మాత్రమే అనుకుంటూ... కాడర్ ని పోషించే క్రమంలో ఆస్తులు కూడా కరిగిపోతున్నాయి అని అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు నిజం గా YS గొప్ప వరం. YS చేసిన పనులు అన్నిటినీ మనం ప్రత్యక్షం గానే చూసాం. అయన చేసిన పనుల్లో అవినీతి ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. ఆరోగ్య శ్రీ అనేది చాలా గొప్ప కార్యక్రమం. కనీసం అటువంటి ఆలోచన చేసే దైర్యం కూడా ఇంత వరకు ఎవరు చేయలేదు. ఆరోగ్య శ్రీ  అనే సంకల్పం చేసినందుకు, YS ను అభినందించాల్సిందే. అయితే, ఆచరణలో లోపాలకు, YS ఒక్కన్నే బాధ్యున్ని చేయడం తగదు అని నా అభిప్రాయం. మన సిస్టం అలా ఉంది. అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ ని దుర్వినియోగం చేయడంలో వారి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. 
రాగా పోగా ఏంటి అంటే, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనే సామెత లాగా మనం చేయం, చేసే వాళ్ళను చేయనివ్వం అనే విధంగా మన రాజకీయ పార్టీలు ఉండటం చాలా బాధాకరం. YS చనిపోయిన తర్వాత కూడా అయన గురించి దుష్ప్రచారం అనేది ఒక సగటు మనిషిగా నన్ను చాలా బాధించే విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ టి ఆర్  అండ్ వైయస్ లను ఇంకా వంద సంవత్సరాలు అయినా ప్రజలు మర్చిపోలేరు అనేది అతిశయోక్తి కాదు. 
ఈ నలుగురు నాయకుల్లో ఎవ్వరూ, రోజుకి పదిహేను గంటలకు తక్కువగా పని చేసి ఉండరు. ఎవ్వరూ మన లాగా వీకెండ్ అని లేట్ గా నిద్ర లేచి, మూవీ కి వెళ్లి, అలా అలా సరదాగా బతకలేదు. ఎన్నో ఒత్తిళ్లకు ఎదురు నిలబడి,ఎన్నో సవాళ్ళను అధిగమించి, ప్రజాహితం కోసం వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసారు. నాయకులు, ముందు వాళ్ళు చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ, వాళ్ళ మంచి ఆలోచనలను కోన సాగిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప, అయన ఇలా చేసారు, ఈయన అలా చేసారు అని సమయాన్ని వృధా చేయడం నిజంగా బాధాకరం. 
బాగా అనుభవం వున్న రోశయ్య గారి పాలన గురించి చాలా హీనంగా మాట్లాడారు మన రాజకీయ నాయకులు. ఇప్పుడు యువకుడు, మంచి క్రీడా స్పూర్తి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని, జూనియర్ అని, అనుభవం లేదు అని మాట్లాడుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని సవాళ్ళను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అని కోరుకుంటున్నాను.

రాజకీయాలను అందరి లాగా విమర్శించడం కాకుండా, రాజకీయాల్లోని మంచి కోణాన్ని మరియు ఒక సగటు ఓటరుగా నా ఆలోచనలను ఆవిష్కరించే ప్రయత్నం ఈ బ్లాగ్ తో  ప్రారంభిస్తున్నాను.

రాధాకృష్ణ