Sunday, 12 December 2010

వర్షంలో స్నానం చేసిన చెట్లు


చిన్నప్పటి నుంచి క్లాసు లో ఫస్ట్ / సెకండ్ ర్యాంక్ ల లో ఉండే వాణ్ణి. మాస్టారు చెప్తున్న పాఠాల్ని చాలా శ్రద్దగా వినే వాణ్ణి. గురువు గారు ఏమి చెప్పినా, దాన్ని కళ్ళకు కట్టినట్టు ఉహించుకోవడం నా ప్రత్యేకత. కొన్ని కొన్ని పాఠాలు అలా ఉహించుకున్నప్పుడు నమ్మ శక్యం గా ఉండేవి కావు. ఆ కోవ కు  చెందిన ఒక పాఠం గురించి రాస్తున్నాను.
ఏ క్లాసు లోనో గుర్తు లేదుగానీ, ఇంగ్లీష్ POETRY (మీరేవరయిన ఈ పాఠం చదివినట్టు గుర్తుంటే, వివరాలు నాకు గుర్తు చేయ ప్రార్థన)

పాఠం ఇలా సాగుతుంది..
కవి వర్షం వెలసిన తర్వాతి ప్రకృతి అందాలను వర్ణిస్తూ పొగుడుతున్నాడు
ఆకాశం అలా ఉంది
మబ్బులు ఇలా ఉన్నాయి
పక్షుల కిల కిల రావాలు
ఇంక ఏదో చాలా చెప్తున్నాడు
అదే క్రమంలో చెట్ల గురించి వర్ణిస్తూ
చెట్లు ఈ వర్షంలో తడిచి అప్పుడే స్నానం చేసినట్లున్నాయి
పచ్చగా ఉన్నాయి, గడ్డి అలా ఉంది ఇలా ఉంది అని సాగుతుంది...

ఆ పాఠం చదివినప్పుడల్లా అంతా బాగానే ఉంది గానీ, ఈ కవి ఏంటి, వర్షంలో చెట్లు స్నానం చేసి పచ్చగా మెరిసిపోతున్నాయి  అంటాడు. మన చెట్లు మాత్రం ఎంత వర్షం పడ్డ అంత పచ్చగా ఉండవే?  మాది నేషనల్ హైవే మీద ఉన్న చిన్న పల్లెటూరు లెండి. కాలుష్యం వల్లనేమో చెట్లన్నీ ఎప్పుడూ మసి బూసినట్టే ఉండేవి. వర్షం పడ్డా, తేడా ఏమీ ఉండేది కాదు. అదీ కాక వర్షం అంటే నాకు, చెడ్డ చిరాకు. కేవలం నాలుగు తరగతి గదులు ఉన్న స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వాళ్ళు కూర్చోవాలి. కొన్ని  క్లాసులు వరండాలో కొన్ని  క్లాసులు చెట్ల కింద కూర్చొని క్లాసులు వినే వాళ్ళం. వర్షం వస్తే ఒక్కో గదిలో రెండేసి, మూడేసి క్లాసులను తోసేసే వాళ్ళు. కోళ్ళ ఫారం లో కోడి పిల్లల్లాగా కీసర బేసర గా ఉండేవి క్లాసులన్నీను. వర్షం వస్తే బురద, రొచ్చు. ఉళ్ళో మురుగంతా మా స్కూల్ ముందే ఉండేది.

నేను కన్విన్సు కానీ పాఠాల్లో ఇది చాలా ముఖ్యంగా మిగిలిపోయింది. చిన్న పిల్లాన్ని కదా! అప్పట్లో మా ఊరు లాగానే ప్రపంచం అంతా ఉంటుంది అనే అమాయకత్వం, తెలియని తనం...



ఆస్ట్రేలియా లో విశాలమయిన పార్కులు, పెద్ద పెద్ద చెట్లు... చాలా సార్లు వర్షం తర్వాత నేను ఆ ప్రకృతి అందాలను ఎంత బావున్నాయో అంటూ చూస్తుండి పోయాను. ఇలా కొన్ని సార్లు వర్షం తర్వాత అందాలను తన్మయత్వంతో చూసిన నాకు-  "ఆ కవి విదేశీయుడు కావడం వల్ల, ఆయన సహజంగానే వాళ్ళ దేశం లో ప్రకృతి ని వర్ణిస్తూ రాసి ఉంటాడు. దాన్ని మన ఊరితో పోల్చుకోవడం వల్ల నేను కన్విన్సు కాలేదు" అనిపించింది. కవి, పైన ఉన్న ఫోటో లో లాంటి అందమయిన ప్రదేశాలను చూసి ఆ కవిత రాసి ఉండొచ్చు.

ఏది ఏమయినా, మా ఉళ్ళో చెట్లు, గట్రా అంత బాగోక పోయినా, (ఈ మధ్య రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉన్న చెట్లన్నింటిని తీసివేశారు లెండి.) చిన్న తనంలో మా ఊరిని నేను ఎంత తిట్టుకున్నా, ఇప్పుడు మాత్రం, మా ఊరు చాలా గొప్ప ఊరు, చాలా అందమయిన ఊరు అంటాను. కాకి పిల్ల కాకి కి ముద్దు అంటారా? మీరేమయిన అనండి, మా ఊరంటే, నాకు చాలా ఇష్టం

No comments:

Post a Comment