Thursday, 9 December 2010

ఫైర్ అలారం గోల

ఆస్ట్రేలియా లో మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో నిన్న ఒక సంఘటన జరిగింది. నిన్న పొద్దున్నే మా ఆయనని ఆఫీసు కి సాగనంపి , నా పనులు చక్కపెట్టుకొని ,స్నానం చేసి పూజ చేయటం మొదలుపెట్టాను.ఇంతలో హటాత్తుగా ఫైర్ అలారం మోగటం మొదలు అయింది .నాకు ఒక్క నిమిషం అర్ధం కాలేదు .ఏమి అవుతుంది, నేను స్టవ్ మీద ఏమైనా పెట్టి మాడ్చేసానా అని అనుమానం వచ్చి చూశాను, ఏమి లేదు. వెంటనే తలుపు తీసాను అందరూ హడావిడి గా పరుగులు తీస్తున్నారు .ఒక చైనా ఆవిడని 'ఏమి అయింది అని' అడిగాను.  ఆవిడ ఏదో చెప్పింది, నాకు ఏమి అర్ధం కాలేదు. సర్లే ఈవిడ తో పెట్టుకుంటే కష్టం అని  మా అయన కి ఫోన్ చేశా. ఏమి బయపడకు పాస్ పోర్ట్ లు, తాళం తీసుకొని లిఫ్ట్ లో కాకుండా మెట్లు దిగి కిందకు వెళ్ళు అన్నారు.ఆ టెన్షన్ లో నాకు మెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా అర్ధం కాలేదు. రోజు లిఫ్ట్ ఉండేసరికి మెట్ల తో పని లేక అవి ఎక్కడ ఉన్నాయో చూస్కోలేదు.మేము ఉండేది 20 వ ఫ్లోర్ లో. అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి నా పని అయిపోయింది.

మన దేశం లో ఐతే ఫోన్ చేసిన గంటకి కానీ ఫైర్ వాళ్ళు రారు. ఇక్కడ మాత్రం రెండు మూడు నిమిషాలలో ఒక పది మంది టీం వచ్చారు ..కొంత మంది కింద ఏదో చేస్తున్నారు కొంత మంది పైకి వెళ్లారు .నాకు మాత్రం ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు.

ఒక వేళ ఇప్పుడు ఏదైనా  జరిగితే  మా సామాను అంతా ఎలా, అసలే మా అయన ఈ మద్యనే laptop కొనిపెట్టారు. నా ధ్యాస అంతా వీటి మీదే ఉంది. సర్లే ఇప్పుడు నేను చేయగలిగింది ఏమి లేదు అని చూస్తున్నాను. నేను ఇక్కడ ఏమి జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటే మా అయన నిమిషానికి ఒక సారి ఫోన్ చేసి అక్కడ తాజా పరిణామాలు ఏంటి అని అడుగుతున్నారు...ఇలా  40 నిముషాల టెన్షన్  తర్వత వాళ్ళు తేల్చింది ఏంటి అయ్యా అంటే...  6 వ అంతస్తులో ఒక మహానుబావుడు ఎవడో ఫైర్ అలారం కింద నుంచొని సిగరెట్ కాల్చుకున్నాడు అట...నాకు ఆ నిమిషం లో అతను ఎవరో చూపిస్తే... కత్తిపీట పెట్టి పీక కోయాలి అనిపించింది.ఇంక అందరూ నెమ్మది గా పైకి  వెళ్ళటం మొదలుపెట్టారు.మనకి అసలే ప్రాణం మీద తీపి ఎక్కువ ,రిస్క్ తీసుకోవటం ఎందుకు అని అందరూ వెళ్ళిన తర్వాత చిన్నగా వెళ్ళాను.

ఇలాంటిదే అంతకు ముందు కూడా ఒక సారి జరిగింది. ఒక రోజు అర్ధరాత్రి మంచి నిద్ర లో ఉన్నాం .ఒక్క సారిగా అలారం మోగింది .మేము తేరుకొని కిందకు వద్దాం అని రెడీ అయ్యేసరికి ఇది ఫాల్స్ అలారం అని ప్రకటించారు..తెల్లారి  మా ఆయన రిసెప్షన్లో  కనుక్కుంటే తెల్సింది ఏంటి అంటే ఎవడో ... పీకల దాక తాగి అర్ధరాత్రి వంట చేయటం మొదలు పెట్టాడట. ఆ మత్తులో ఆ కూర కాస్త మాడి అలారం మోగింది అట. నైట్ రెండు గంటలకు వంటేమిటి వాడి బొంద.

అయినా వీళ్ళిద్దరి తిక్క బాగా కుదిరిందిలే. అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి చెరొక 2000 $ జరిమానా విదించారుగా !!!

ఈ మధ్య మా అయన బ్లాగ్ లు రాయటం మొదలు పెట్టారు.
సరే నేను కూడా ఒక రాయి వేద్దాం అని  రాస్తున్నాను.

శ్రీమతి కృష్ణ

2 comments:

  1. శ్రీమతి కృష్ణ గారు,
    చాల కంగారు పడ్డారన్నమాట.
    >>>కత్తిపీట పెట్టి పీక కోయాలి అనిపించింది.
    :) మరీ కత్తిపీటపెట్టి కోసేస్తారా.

    ReplyDelete
  2. avunandee sisira garu, chala bhayapaddunu.
    >>>కత్తిపీట పెట్టి పీక కోయాలి అనిపించింది.
    ante, chala kopam vachindi ani na uddesyam andi.

    Thankyou

    ReplyDelete