రాజకీయాలు అంటే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడానికి మంచి మార్గం అని అందరం అనుకుంటాం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పవర్ చేతిలో ఉంటుంది, బ్యాంకు రుణాలు సులభంగా తెచ్చుకోగలరు. సామాన్యుడు బర్త్/డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా నానా తంటాలు పడతాడు. కానీ నాయకులకు మాత్రం చాలా వీజీ గా ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా ఫోన్ మీదనే అంత రెడీ అవుతుంది. దాన్నే మనం అదికార దుర్వినియోగం అంటాం. దుర్వినియోగం కూడా ఒక మోతాదు వరకు అవసరమేమో అనిపిస్తుంది మా యాకోబు గుర్తుకొచ్చినప్పుడు...
మా గ్రామంలో యాకోబు అని ఒక గొర్రెల కాపరి ఉండే వాడు. వేలిముద్ర బాపతు. తనలోకంలో తను గుట్టుగా బతుకుతున్నాడు. చిన్న తనంలో నేను మా పొలాల్లో తిరిగే రోజుల్లో గొర్రెలు కాస్తూ కనిపించేవాడు.
ఈ మధ్య నేను, మా అన్నపొలం నుంచి వస్తుంటే, ఒక మనిషి అన్నయ్యని పలకరించాడు. వైట్ షర్టు వైట్ లుంగి, కాంగ్రెస్ టవల్. నేను గుర్తుపట్టలేదు. మా అన్న చెప్పాడు, యాకోబు రా అని. యాకోబు ఏంటి, ఈ గెటప్ ఏంటి, నాకు ఏమీ అర్ధం కాలేదు... తర్వాత అన్న చెప్పింది ఏంటి అంటే- 2001 ఎన్నికల్లో, యాకోబు వద్దు మొర్రో అన్నా రిజర్వేషన్స్ పుణ్యమా అని MTPC మెంబర్ గా పోటీ చేయాల్సి రావడం, ఇంటర్మీడియట్ చదివిన ప్రత్యర్ధి మీద గెలవడం, ఎంత వేగంగా పదవి వచ్చిందో అంతే వేగంగా పదవీకాలం ముగియడం, తర్వాత MPTC మెంబర్ వేరే వర్గానికి రిజర్వు కావడం... పాపం ఇంతకు ముందు హ్యాపీ గా గొర్రెలు కాసుకు బతికేవాడు. ఈ రాజకీయం పుణ్యమా అని ఉన్న 50 గొర్రెలను అమ్ముకొని, ఖర్చుపెట్టాడు. పదవి ఉన్నంత కాలం ఏదో అలా నెట్టుకొచ్చాడు. పదవి పోయాక, పలకరించే దిక్కు లేక, తను గతం లో చేసిన పనులు చెయ్యలేక, ఇలా వైట్ అండ్ వైట్ రాజకీయ నాయకుడి గెటప్ లోనే కాలక్షేపం చేస్తున్నాడు అని చెప్పాడు. మరి కుటుంబం పరిస్థితి ఏంటి అంటే,యాకోబు మీద గౌరవంతో, పెళ్ళాం అర్ధం చేస్కొని 2 గేదెలను పెట్టుకొని కుటుంబ బారాన్ని మోస్తుందని చెప్పాడు.
అతడు సినిమాలో MS నారాయణ దోసె జోక్ గుర్తుకొచ్చింది. నా మానాన నేను మాడి పోయిన మసాల దోస తింటుంటే...
యాకోబు తన నిజాయితి కి కట్టుబడి, ఎటువంటి ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా, ఆశించకుండా పని చేసి, ఇలా రాజకీయ కష్టాలు పడుతుంటే, చూసే వాళ్ళకు 'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అని అనిపించడంలో ఆశ్చర్యం ఏమయినా ఉందా?
మన వ్యవస్థలో కూడా లోపం ఉంది. MPTC మెంబర్ పదవి అయిపోయాక గొర్రెలు కాయకూడదు అనే యాకోబు మైండ్ సెట్ కావొచ్చు.రాజకీయం అంటేనే అవినీతి, అక్రమార్జన, రాజకీయ నాయకులంటే మానవాతీతులు, వాళ్ళు మామూలు పనులు చేయకూడదు అనే సమాజం కావొచ్చు. రిజర్వేషన్ వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకునే ప్రభుత్వ విధానాలు కావొచ్చు.
యాకోబు లాగా ఇబ్బందులు పడుతున్నచిన్ననాయకులకు ఏదో ప్రత్యేక అవకాశాలు కల్పించాలేమో? దాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి మన వాళ్ళు పోటీపడతారేమో?
ఏది ఏమయినా, అన్ని రంగాల్లో లాగానే రాజకీయాల్లో కూడా ఇలాంటి అవస్థలు పడుతున్న మా యాకోబు లాంటి వారు చాలా మందే ఉన్నారు.
చాలా బాగుంది రాధా గారు మీ బ్లాగు
ReplyDelete