Wednesday, 8 December 2010

ఆస్ట్రేలియా లో మా ఇక్కట్లు


ఆస్ట్రేలియా ఒక అందమైన దేశం. మా కంపెనీ వాడి పుణ్యమా అని, నా శ్రీమతికి  బ్రిస్బేన్ మరియు మెల్బర్న్ చూపించ గలిగాను. బ్రిస్బేన్  లో మూడు నెలలు ఉన్నాం . ఇండియా వెళ్లి "ఇంటి దగ్గర నుంచి  పని" దయ వల్ల రెండు నెలలు ఇంట్లో పేరెంట్స్ తో ఉంటూ పనిచేస్కోని, మళ్ళీ మెల్బర్న్ కి  వచ్చాం . ఇటీవల కాలంలో భారతీయుల మీద దాడుల దృష్ట్యా  మొదటి నుంచి  ఆస్ట్రేలియా అంటే  వెళ్లొద్దు అని  ఇంట్లో గొడవ.ఏదో వాళ్ళకి నచ్చచెప్పి బ్రిస్బేన్ వెళ్ళాం. అక్కడ అంత సాఫీ గా సాగిపాయింది.ఈ సారి మెల్బర్న్ అంటే అస్సలు ఒప్పుకోలేదు. మా అత్తా మామలు కూడా  చాలా భయడ్డారు.

చాలా కష్టపడి అందర్నీ ఒప్పించి  మెల్బోర్న్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి మా కష్టాల పర్వం మొదలు అయింది. మేము ఉండటానికి అన్ని ఏర్పాట్లు మా కంపెనీ వాళ్ళే చేసారు. 

మనం వచ్చి  పాస్ పోర్ట్ చూపించి, ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే మనకు రూం ఇస్తారట.మాకు కేటాయించిన అపార్ట్ మెంట్ నిర్వహణ సిబ్బంది కూడా మన లాగానే శని అది వారాల్లో ఎంచక్కా సెలవు తీసుకోవడం తో బాటు కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే పని చేస్తారట. మా కంపెనీ వాళ్ళు మాకు ఇంత వివరంగా చెప్పి ఉంటే, బహుశా ఈ బ్లాగ్ రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన పని ఉండేది కాదు.

మీరు వెళ్ళగానే ఉండటానికి వేరే హోటల్ రెండు రోజులకు బుక్ చేసాము, దానిలో చెక్-ఇన్ చేస్కొని విశ్రాంతి తీస్కోని మరునాడు చక్కగా ఆఫీసు కి వెళ్లి, మీకు వీలయినప్పుడు అపార్ట్మెంట్ కి వెళ్ళండి. మీకు టెన్షన్ ఉండకూడదు అని రెండు రోజులకు హోటల్ బుక్ చేసాం, పండగ చేస్కొండి అన్న రేంజ్ లో చెప్పాడు మావాడు.  ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్  క్రోకోడయల్ ఫెస్టివల్... అని మాకు తెలియదు కదా.

మేము గురువారం  మెల్బర్న్ లో దిగాం కదా...  అక్కడ నుంచి నేరుగా హోటల్ కి వెళ్ళాం. వెదవది హోటల్లో కనీసం కాఫీ పెట్టుకునే సౌకర్యం కూడా లేదు. ఆ రాత్రికి  KFC మీద ఆధారపడ్డం .శుక్రవారం ఉదయం అల్పాహారంగా ఏదో బిస్కెట్స్,ఆపిల్ తిన్నాం . శ్రీమతికి  లంచ్ టైములో తినటానికి ఏదో ఇచ్చి నేను ఆఫీసు బయల్దేరాను. మొదటి రోజు కదా... ఉల్లాసంగా ఉత్సాహంగా, ఆస్ట్రేలియా దేశంలో... మెల్బర్న్ నగరంలో... అని ప్యారడీ పాటలు పాడుకుంటూ.... ఆఫీసు కి వెళ్ళాను.

KFC  , మెక్ డోనల్డ్స్ తో మొహం మొత్తిన మేము,   శుక్రవారం రాత్రి  ఆహా, రేపు పొద్దున్నే ఎంచక్కా అపార్ట్మెంట్ కి వెళ్ళొచ్చు, సుష్టు  గా వండుకొని తినొచ్చు, అనుకుంటూ గుడ్ నైట్ చెప్పుకున్నాం. శనివారం ప్రొద్దున్నేకాలింగ్ బెల్ మోగుతుంటే, ఎవడబ్బా అనుకుంటూ లేచి చూశాను, ఎదురుగా హోటల్ బాయ్ క్లోజ్ అప్ నవ్వుతో , మీరు  పన్నెండు గంటలకు ఖాళీ చేయాలి అని చెప్పాడు. టైం చుస్తే, అప్పటికే, పదకొండున్నర అయింది, జెట్లాగ్ ప్రభావం తో మేము  కుంభ కర్ణ ద్వయం లాగా నిద్రపోయాం అని అర్ధం అయింది.

హడావిడిగా బయల్దేరి హోటల్ రూం ఖాళీ చేసి,  అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్ళాం. అక్కడ, మమ్మల్ని పలకరించే నాధుడే లేడు. చేసేది  లేక మా కంపెనీ వాడికి ఫోన్ చేసి విషయం వివరించాము. వాడు తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి, ఈ రోజు శనివారం కదా,  రిసెప్షన్ లో ఎవ్వరూ  ఉండరు, మీరు వెళ్ళటానికి కుదరదు అని మాకు చావు కబురు చల్లగా చెప్పాడు. ఏమి చేయాలో పాలు  పోలేదు. నేను డిటెక్టివ్ నారద లాగా కష్టపడి, మొత్తం మీద అత్యవసర సిబ్బంది నెంబర్ సంపాదించాను. 10 సార్లు ట్రై చేస్తే, దేవుడి కరుణించి, వాడు ఫోన్ తీసి మా బాధ అర్ధం చేస్కొని అక్కడికి వచ్చి మమ్మల్ని లోపలి తీసుకువెళ్ళాడు. ఇతను మమ్మల్ని మా రూం లోకి తీసుకెళ్ల గలడు కానీ, తాళాలు ఇచ్చే అధికారం తనకు లేదు. అంటే, రూం లోపల ఎప్పుడూ ఒకళ్ళు ఉండి తలుపు లోపలినుంచి తియ్యాలి అన్నమాట. కొసమెరుపు ఏంటి అంటే, మా వాడు ఏమి చెప్పాడో, వీడు ఏమి విన్నాడో గానీ, సింగిల్ కాట్ ఉన్న రూం  ఇచ్చాడు. 

ఏదో ఒకటిలే  ముందు ఉండటానికి ఉంది కదా, ఈ రోజు ఒక్క రోజు సర్దుకుపోదాంలే  అనుకున్నాం .చాలా చిన్న రూం, పేరుకు స్టూడియో అపార్ట్మెంట్ కానీ కిచెన్ లో కనీసం చెంచా కూడా లేదు. బాచిలర్ రోజుల్లో కొత్తగా రూం తెస్కొని , కిరోసిన్ స్టవ్, గిన్నెలన్నీ కొనుకున్నట్టు, నేను ఒక్కన్నే వుల్ వర్త్ సూపర్ మార్కెట్ కి వెళ్లి, చెంచా, కత్తి, ప్లేట్, కూర గిన్నెలు... ఇలా కావాల్సిన వన్నీ కొనుక్కొని ఇంటికొచ్చే సరికి టైం సాయంత్రం నాలుగున్నర. అసలే మా పరిస్థితి పులిహోర మీద విరక్తి చెందిన వరద బాదితుల్లాగా ఉంది. దానికి తోడూ ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు.
అంతా నీరసంలో కూడా, పాపం చాలా ఓపిక చేస్కొని, పొయ్యి వెలిగించి, వంట చేసింది మా ఇంటావిడ. తృప్తిగా తిని  మూడు రోజులు అయినదేమో, టమాట కూర, గ్రీక్ స్టైల్ పెరుగుతో  చాలా చాలా సంతోషంగా తిన్నాం. ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా 'దేవుడు ఆడవారికి ఓపిక, సహనం ఇచ్చి ఉండకపోతే ఈ భూమి మీద చాలా పనులు ఆగిపోతాయేమో కదా'  అనిపిస్తుంది.

ఇవి కేవలం మొదటి మూడు రోజుల కష్టాలే.ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ రియల్ క్రోకో డయల్ ఫెస్టివల్... మిగతా కష్టాలను వచ్చే టపాలో వివరిస్తాను.
సెలవు...

7 comments:

  1. చాలా ఇబ్బందిపడ్డారన్నమాట. కొత్తచోటులో ఒక్కొక్కసారి అంతేలెండి. తప్పించుకోవలన్నా తప్పించుకోలేము. ఇప్పుడు అంతా బాగానే ఉందాండి?

    ReplyDelete
  2. hi,

    welcome to the club. the same happened to me when I reached london.

    ReplyDelete
  3. Crocadile festival ? good.

    This reminds me our first trip to Englad, where we stayed in Travelodge. However, there was nothing to eat, except Kellogs breakfast (£5 a pack) - No where to go in that cold weather. We were searching for an apartment. Didnt know where is a super market.. Where is a restaurant etc. A friend and his wife had brought us south inian lunch (kerala lunch) - the following day. After starving for two days, we had nice food on that day. I started respecting food (any style) after that day, since I was very selective before that. Cant forget the day. We became good friends afterwards.

    ReplyDelete
  4. శిశిర గారు, మొదటి నెల రోజుల పరీక్షల తర్వాత బాగానే ఉందండి. నిజమేనండీ, తప్పించుకోవాలి అనుకున్నా, తప్పించుకోలేము.

    ReplyDelete
  5. మన్నించాలి, confused గారు అని పిలిచేస్తున్నాను, చాలా అదృష్టవంతులు అయితే తప్ప ఈ పరిస్టితుల నుంచి తప్పించుకోలేమో నండి. థ్యాంక్స్ అండి.

    ReplyDelete
  6. సుజాత గారు,

    నేనొక నిజం చెప్పకుండా ఉండలేకపోతున్ననండీ
    అదేంటో, మనిషి సైకాలజీ ఇలానే ఉంటుందేమో...
    ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆఫీసు వర్క్ ని మేనేజ్ చేయలేక చాలా మధన పడే వాణ్ణి.
    ఉక్రోషం ఆపుకోలేక, మా జనరల్ అడ్మిన్ గాడి మీద మెయిల్స్ తో దాడి చేసేవాణ్ణి.

    మీ స్పందనలు చూసాక.. హమ్మయ్యా, నేనొక్కన్నే కాదు, నా లాగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు అని అదొక ఉరట కలుగుతుంది.

    పొలంలో పురుగు మందు పని చేయనప్పుడు, మా నాన్న, మందుల షాపు వాడి దగ్గరకు వెళ్లి నాలుగు చివాట్లు పెట్టేవాడట. ఆ టైములో షాపు వాడు తెలివిగా... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండీ, మీ ఊరు సుబ్బారావు గారు కూడా ఇదే మందు వాడాడట. పని చేయలేదట.పాపం!!! ఆయనకి ఈ మందు ఇచ్చాను. మీరు కూడా ట్రై చేయండి అనే వాడట. పాపం, మా నాన్న అసలు విషయం మర్చిపోయి షాపు వాడు చెప్పిన మందు కొనుక్కోచేవాడట. :-)

    థ్యాంక్స్ అండి సుజాత గారు.

    ReplyDelete